
- మావోయిస్టుల మందుపాతరుకు బలైన కామారెడ్డి, ఘట్‌కేసర్‌కు చెందిన జవాన్లు
- మృతులకు రూ.కోటి పరిహారం, ఇంటి స్థలం : మంత్రి పొన్నం
- కామారెడ్డి జిల్లా పాల్వంచలో పాల్గొన్న మంత్రి పొన్నం, ఘట్‌కేసర్‌లో మంత్రి శ్రీధర్‌బాబు, స్పీకర్ ప్రసాద్
కామారెడ్డి/ఘటేకేసర్, వెలుగు : కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో చనిపోయిన జవాన్ల అంత్యక్రియలు శుక్రవారం వారి స్వగ్రామాల్లో జరిగాయి. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ స్వగ్రామం కామారెడ్డి జిల్లా పాల్వంచలో జరిగిన అంత్యక్రియలకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్ మోహన్‌రావు, కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర హాజరై నివాళులర్పించారు. అనంతరం జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రేహౌండ్స్ కమాండర్ రాఘవేంధర్‌రెడ్డి, ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఆర్డీవో వీణ, లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి సైతం శ్రీధర్ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.
రూ. కోటి పరిహారం, 300 గజాల ఇంటి స్థలం
శ్రీధర్ అంత్యక్రియల అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో జవాన్లు చనిపోవడం బాధాకరం అన్నారు. శ్రీధర్ ఫ్యామిలీకి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున రూ.కోటితో పాటు 300 గజాల ఇంటి స్థలం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. హింసకు తావు లేకుండా చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని, చర్చల కోసం మావోయిస్టులు కూడా దిగొచ్చారన్నారు. లా అండర్ ఆర్డర్‌ను కాపాడుకుండూ ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు.
ఘట్‌కేసర్‌లో..
ఘట్‌కేసర్, వెలుగు : మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు బలైన గ్రౌండ్స్ కానిస్టేబుల్ తిక్క సందీప్ అంత్యక్రియలు శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. మేడ్చల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, కలెక్టర్ గౌతమ్ పోట్రు, రాచకొండ సీపీ సుధీర్‌బాబుతో పాటు పలు పార్టీల నాయకులు సందీప్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సందీప్కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సందీప్ ఫ్యామిలీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.కోటి ఆర్థిక సాయంతో పాటు, 300 గజాల స్థలం ఇస్తామన్నారు.
అలాగే సందీప్ భార్యకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. సందీప్ సోదరుడికి సైతం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పారు. స్థానిక శ్మశానవాటికలో పోలీసులు గౌరవ వందనం సమర్పించిన అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఏసీపీ చక్రపాణి పాల్గొన్నారు.